మనసా, నీ మాయ తెర తీయవదేల?


మనసా, నీ మాయ తెర తీయవదేల?

M. Anitha

ఏమిటే నీ మాయ, ఓ మనసా?
ఈ చిక్కుముడి విప్పగలేవా?
నీ మాయ తెర తీయవదేల?

మదిని హోరెత్తిస్తున్న ఆలోచనల జోరు
అంతరంగంలో నెలకొంది అయోమయపు తీరు
అణుక్షణం చెలరేగే ఆలోచనల సుడిగుండంలో
సతమతమవుతూ ఉన్నా, ఇపుడెందుకో మరి,
శాంత సమీరంలా, గంభీర సాగరంలా,
నిశ్చల పర్వతంలా, గుంభనంగా తోస్తున్నది

ఉవ్వెత్తున ఎగసే సముద్రపు అలలైనా తీరం చేరి సద్దుమణుగుతాయి
మరీ మనఃసాగరంలో ఎగసే ఆలోచనలు తీరం చేరేదెన్నడో?
భీకరమైన పెనుతుఫాను కూడా కొంత సమయానికి శాంతిస్తుంది
మరి మనసులోని ఆలోచనల తుఫాను శాంతించేదెప్పుడో?
ఉరకలు వేసే జలపాతం కూడా నదిలా మారి మంద్రంగా సాగుతుంది
మరీ ఆలోచనల జలపాతం శాంత మందాకినిలా మారేదెన్నడో?
అగ్నిపర్వతం నుండి పెల్లుబికిన లావాగ్నీ చల్లబడుతుంది
కానీ ఆలోచనల బడబాగ్ని మాత్రం చల్లారదదేమిటో?

ఏమిటే నీ మాయ, ఓ మనసా?
ఈ చిక్కుముడి విప్పగలేవా?
నీ మాయ తెర తీయవదేల?

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.