మూసీ ఉరకల పరవళ్ళు


మూసీ ఉరకల పరవళ్ళు
అనిత
ఎవ్వరివమ్మా నువ్వు?
నా చిన్నతనంలో నిన్ను చూశా
నువ్వొక మురుక్కాలువనుకున్నా
కొంచెం పెద్దయ్యాక మరోసారి
సూర్యపేటలో నీ పేరు విన్నా
నువ్వే వారి జీవనాధారమంట
అది విని విస్తుబోయా
మళ్ళీ నిన్ను కలిశా
అక్కడ నీ మరో రూపాన్ని చూశా
మరది నువ్వేనా అని విస్తుబోయా
అప్పుడర్ధమైంది నువ్వు నదివని
మురుక్కాలువవి కావని
నీ పూర్వ వైభవం విన్నా
నా నోట మాట రాలే
ఓడలు బళ్ళూ, బళ్ళు ఓడలూ
అవుతాయని విన్నా
నీ విషయంలో అది
అక్షరాలా నిజమనుకున్నా
నీ ఉరకల గలగలలు
నీ నురుగుల పరవళ్ళు
నీ వంపుల వయ్యారాలు
నీ కులుకుల నడకలు
నీ సొగసుల సొబగులు
మళ్ళీ చూడాలనుకున్నా
అడపా దడపా విన్నా
నీ ప్రక్షాళన గురించి
అది అసాధ్యమని కొందరి నోట విన్నా
కానీ అవి కలలు కదా!
వాటికి సాధ్యాసాధ్యాలతో పనేమిటి?
ఆ కల కన్నది ఒక్క నేనేనా?
నాలాంటి మరెందరో
ఆ కలనిజమయ్యేనా
ఆ దిశగా అడుగులు పడుతున్నాయంట
ఆ ప్రయత్నం గమ్యం చేరేనా?
మరి ఎందరిదో ఆ కల నిజమయ్యేనా?
మూసీ ఉరకలెత్తలేనా?
ఏమో!
హైద్రాబాదు మరో బృందావనమవుతుందా!

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.