ఆంధ్రప్రదేశ్ దశ దిశ గురించి కొందరు పెద్దలు చర్చిస్తున్నప్పుడు అసలు తెలంగాణా దశ దిశ, ఇంకా తెలంగాణా ఉద్యమం దశ దిశను గురించి చర్చించాల్సిన అవసరం లేదా అని లేదా అనిపించక మానదు.
ఆంధ్రవలస పాలకులు, సమైక్యాంధ్ర వాదులూ వేస్తున్న ప్రశ్నలకు, వెలిబుచ్చుతున్న అనుమానాలకు తెలంగాణా వాదులు ఎంతో ఓపికతో, ఐకమత్యంతో జవాబులు చెపుతుంటే ఎంతో ముచ్చటగా ఉన్నది. అయితే కొన్ని ప్రశ్నలు ఇంకా స్పష్టంగా చర్చించాల్సి ఉంది. ఇది ఆంధ్రవాళ్ళకో అమెరికావారికో చెప్పేందుకు కాదు. ఇది అందరితో పాటు తెలంగాణా ప్రజలకు కూడ ఇంకా వివరించాల్సే ఉంది.
ఈ విషయాలు ఎప్పుడో చెప్పాము కదా అనేవాళ్ళలో కొందరు, సమస్త సందేహాలకు సంపూర్ణ సమాధానాలు ఉన్నాయన్న వాళ్ళలో కొందరు తమ ఆలోచన అంత సరయినది కాదని అనకపోయినా మరోమారు ఆలోచించి సూటిగా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం మాత్రం ఉందని అనకపోరు. అలాగే తెలంగాణ వ్యతిరేకులు, సమైక్యాంధ్ర వాదులు, రాయలసీమ వాదులు ఇంకా అనేక వాదులూ కూడ ఎదో మాటకు మాట వాదానికి ప్రతివాదం అంటూ గొంతు సవరించుకొంటూ ఉపన్యాసాలివ్వడమే తప్పా ఒక ఆంధ్ర వాదం అంటూ ఏమైనా ఉందా? అది నలుగురు ఒప్పుకొనే వాదమేనా అని ఆలోచించాలి.
చాల కాలంగా తెలంగాణ విషయం వార్తల్లో ఉంది. చాలా సార్లు చెప్పిందేకదా అన్నప్పటికి ఇంకా అవసరమున్న ప్రశ్నలు కొన్ని, మరికొన్ని ఇంతవరకు పెద్దగా చర్చకు రానివి. చాలా ప్రశ్నలు పలు రూపాల్లో తెలంగాణ వ్యతిరేకులుగాని, తెలంగాణవాదులు గాని అడిగనవి, వీమశల్లో వచ్చినవి, చర్చించినవి చర్చించకుండానే పక్కకు పెట్టినవి ఉన్నాయి. అందులో కొన్నింటిని ఇక్కడ పేర్కొనడమైనది. వాటికి ఇవి జవాబులు అని నా మాట చెప్పడంకన్నా, ఇదొక జవాబు కావొచ్చేమో ఇంకా సరైన జవాబేమైనా ఉందా అని గమనించే వీలు కలిగించడానికే ఈ ప్రయత్నం. కనుక మిత్రులు ప్రశ్నల ప్రాముఖ్యతను గమనిస్తారని జవాబులను వెతుకుతారని మనవి. తరుచుగా వచ్చే ప్రశ్నల్లో ముఖ్యమైనవి.
1. తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత ఏమిటి?
2. ఆంధ్ర రాష్ట్రంతో కలవడం వలన ఏ ఏ వర్గాల ప్రజలు ఏ రకంగా నష్టపోయారు?
3. అసలు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుతోనే సమస్యలన్నీ తీరిపోతాయా?
4. ఒకవేళ తీరిపోతే ఏ వర్గపు ప్రజల జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి?
5. అసలు తెలంగాణా పోరాటానికి గమ్యమేమిటి? అసలు గమ్యమంటూ ఉందా?
6. ఆ గమ్యాన్ని సాధించడానికి మార్గమేమిటి?
7. ఆ మార్గంలో ఎవరి పాత్ర ఏమిటి?
8.తెలంగాణా పోరాటం ఎవరికి వ్యతిరేకం
ఇవి కొన్ని ప్రాధమిక ప్రశ్నలు. వీటిలో కొన్నింటికి సమాధానాలు ఒకమేరకు ఉన్నా సమగ్రంగా లేవు, అందుకే పదే పదే చర్చకు వస్తున్నాయి. ప్రశ్నలు సరైనవా కాదా అని కాకుండా వాటిని అడిగేవారెవరన్నదాన్ని బట్టి జవాబివ్వాలా లేదా అని ఇంతవరకు వాయిదా వేయడమే అవి ఇంకా తింగ్స్ టు డూ లిస్టులో ఉండడానికి కారణం. ఇపుడు శ్రీ కృష్ణ కమీషను కారణంగా ఇష్టమున్నా లేకున్న కొంతమేరకు వీటిని మరొక సారి తడమాల్సి వస్తున్నది. ఏ తెలంగాణా నాయకులు వీటికి జవాబు చెప్పలేదు, కొందరైతే అన్ని సమస్యలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే సంపూర్ణ జవాబని దాటవేసారు. మరికొందరు ఫలాన సమస్యకు జవాబు వెతకాడానికి ఇది సరైన సమయం కాదని జ్యోతిష్య పంతుళ్ళలాగా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఏ సమస్య చర్చింటానికి, పరిష్కరించటానికి ఏది సరైన సమయమో నిర్దిష్టంగా ఒక కాలెండరు ప్రకటించనంతవరకు ఈ సమస్యలు మళ్ళీ మళ్ళీ తలెత్తుతూనే ఉంటాయి. జవాబులు లేకపోతేనో చెప్పలేకపోతేనో ప్రశ్నలు ఆగిపోవని తెలంగాణ వాదులు తెలంగాణ వ్యతిరేకులు గమనించక తప్పదు.
ప్రాధమిక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందని కాని, అసలు ఈ ప్రశ్నలంటూ ఉన్నాయనికాని ఎవ్వరూ అనుకోకపోవడం చాలా విచిత్రంగా విడ్డూరంగా ఉన్నది. ఏ ఉద్యమంలో నయినా ఉద్యమాన్ని వ్యతిరేకించే వారెలాగూ ఉద్యమం వలన చాలా నష్టాలున్నాయని, వారిమార్గం సరైంది కాదని, వారు ఒకవేళ విజయం సాధించినా వారికి నష్టమే తప్ప లాభం జరగదనీ అంటుంటారు. అది చాలా సహజం? ఉద్యమాన్ని చల్లార్చడానికి వాళ్ళని మెత్తబరచడానికి సామ దాన భేద దండోపాయాలన్ని ప్రయోగిస్తారు. అయినా సరే ఉద్యమకారులు వారు కలిగించే ఆటంకాలకు ప్రాధాన్యమివ్వకుండా తమలోని వివిధ వర్గాల ప్రజలను సంఘటితం చేసుకుంటూ ముందుకు సాగడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే తెలంగాణా ఉద్యమంలో ఆ ప్రయత్నంకంటే కూడా ఉద్యమ వ్యతిరేకశక్తుల్ని సమాధానపరచడం, వారినే ఉద్యమానికి ‘సహకరించేలా’ చేయడంలో తలమునకల ప్రయత్నాలు కనిపిస్తాయి. ఇది బహు ప్రశంసనీయం. కాని అంతకన్నా ఉద్యమ న్యాయబద్దతను, ఆవశ్యకతను, పోరాడితే తప్ప న్యాయం జరగని పరిస్థితిని గురించి, పోరాట మార్గాన్ని గురించి మరింత వివరంగా చెప్పల్సిన అవసరం ఉంది.
ఎవరెరెవకో ఎన్నెన్నో ప్రశ్నలు. అయితే ఏ ప్రశ్నలకు జవాబు చెప్పాలి? ఎవరి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉన్నది? వేటికి ప్రాముఖ్యం ఇవ్వవలసిన అవసరం ఉన్నది? అసలు ఆయా ప్రశ్నల వెనుక ఉద్దేశ్యం ఏమిటి? ఉద్యమాన్ని వ్యతిరేకించే వారి ప్రశ్నలు సహజంగానే ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నంలో భాగంగానే ఉంటాయి. ఆ విషయం ఎంతటి అమాయకులకైనా వెంటనే అర్ధమయిపోతుంది. అంతేగాదు ప్రశ్నలకు నిజమైన జవాబులే కావాలి, ఇవ్వాల్టికి పనికొచ్చే జవాబు ఒకటి, రేపటికి ఉండే జవాబు మరొకటి అంటూ ఉండవు. జవాబులు ప్రత్యర్థులకు ఒక విధంగా బలపర్చేవారికి ఒక విధంగా అంటూ ఉండవనీ గమనించాలి. ప్రత్యర్థులకు సమాధానం చెప్పినట్లే చెప్పి వారికి తెలియకుండా వారి కళ్ళను వారే పొడుచుకునేలా చేస్తాం చూడండి, అంటే ప్రత్యర్ధి అంత అమాయకుడే అయితే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం మనకు వచ్చేదే కాదు. అయినా వాళ్ళకి ఇచ్చే అలాంటి సమాధానాలు కాలక్షేపానికో కాలయాపనకో పనికొస్తాయి కాని, ఈ సమాధానాల వలన ఎవరయినా మనసు మార్చుకుంటారనే అనుకుంటున్నారా, లేకపోతే ఎవరయినా కన్విన్స్ అయి తాము చేస్తున్న దోపిడీని ఆపేసి మనల్ని వదిలి వారి దారిన వారు వెళ్ళిపోతారనే అనుకుంటున్నారా? ఇవన్నీ అయ్యే పనులేనా?
ఇంతవరకు సాగిన ప్రశ్నా జవాబులు తీరు పరిశీలించాలి, లోపాలను ఇప్పటికైన కొన్ని ఉన్నాయనుకొనేవారు వాటిని సవరించుకోవాలి.
మొదట ప్రాధమిక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణా ఉద్యమ దశ దిశ మరిదాని నిర్మాణస్వరూపాలు, లోపాలు దానంతటవే బయట పడతాయి. వీటిలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా మిగతా ప్రశ్నలకు సమాధానాలు సహజంగానే దొరుకుతాయి. తెలంగాణా ఉద్యమానికి సంబంధించి అన్ని వర్గాల తెలంగాణ ప్రజల ప్రశ్నలు ఒకటే అయినప్పటికి సమాధానాలు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి ఉమ్మడి రాష్ట్రం కారణంగా వివిధ వర్గాల ప్రజల జీవనంలో ఎదురయిన సమస్యలు జరిగిన నష్టం గురించి, వాటి పరిష్కారానికి ఏం చేయాలి అనే దాని గురించి వేర్వేరుగా చర్చించితే తప్ప ఆ చర్చ సంపూర్ణంగా ఉండదు.
ప్రత్యేక తెలంగాణా ఆవశ్యకత ఏమిటి?
ఆంధ్ర రాష్ట్రంతో కలవడం వలన ఏ ఏ వర్గాల ప్రజలు ఏ రకంగా నష్టపోయారు?
అసలు తెలంగాణా పోరాటానికి గమ్యమేమిటి? అసలు గమ్యమంటూ ఉందా?
ఆ గమ్యాన్ని సాధించడానికి మార్గమేమిటి?
ఆ మార్గంలో ఎవరి పాత్ర ఏమిటి?
అసలు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుతోనే సమస్యలన్నీ తీరిపోతాయా?
ఒకవేళ తీరిపోతే ఏ వర్గపు ప్రజల జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి?
ఈ ప్రశ్నలన్నిటికి, వీలైనంతవరకు వివిధ వర్గాల ప్రజల సమస్యలను సృశించుకుంటూ, సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఏ కారణాల చేతనైతేనేమి, ఆంధ్రప్రాంతానికి, తెలంగాణా ప్రాంతానికి నైసర్గికంగా, సామాజికంగా, విద్యాపరంగా, భాషాపరంగా, అభివృద్ధిపరంగా, జీవనశైలిలో కూడా చాలాతేడాలున్నాయి. ఒకే భాష మాట్లాడతారన్న ఒక్క కారణం మినహా రెండు ప్రాంతాలను ఒక్కటిగా కలిపే మరే కారణమూ ఏవిధంగా చూసినా కనిపించదు. అందుకనే తెలంగాణా ప్రజలు ఆంధ్రప్రాంతంతో కలవడానికి వివిధ అబ్యంతరాలను వ్యక్తం చేసినారు. ఆ భయాల సారాంశం – తెలంగాణా ప్రజలంతా ఇప్పటివరకూ ఏ పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో అదే పెత్తందారీ వ్యవస్థ అదే రూపంలోనో మరో రూపంలోనో బలోపెతం కావడానికీ, ఇంకా పెత్తనం చేతులు మారడానికీ, ప్రజలకున్న సమస్యలను పెంచడానికీ మాత్రమే ఈ కలయిక దోహదం చేస్తుంది అనేదే. అంటే ఇప్పటి వరకు ఇక్కడి పెత్తందారీ వ్యవస్థ కారణంగా దోపిడీకి గురయిన జనం, దీనితో పాటు ఆంధ్రా పెత్తందారుల (వలస పాలకుల) దెపిడీకి కూడా గురవుతారు అనే విషయమే ప్రత్యేక రాష్ట్ర డిమాండుకున్న నేపథ్యం. ఇది దోపిడికి వ్యతిరేకమైన పోరాట ఆకాంక్ష. అందులో భాగంగానే ఆంధ్ర వలస దోపిడిని అంతం చేయడానికి ఈ బలవంతపు కలయికను అంతం చేయడం అనివార్యం.
అప్పటి ప్రజల ఆ భయం పూర్తిగా నిజమయ్యింది. ఫజలలీ కమిషన్‌కానీ, పెద్దమనుషుల ఒప్పందం కానీ, రాష్ట్రపతి ఉత్తర్వుకానీ, ఆరు సూత్రాల పధకం కానీ వీటిని ఆపలేకపోయాయి. పైగా ఈ ఒప్పందాలు, వాగ్దానాలూ, సూత్రాలూ అంతవరకూ జరిగిన దోపిడీని, గైర్ ముల్కీల అక్రమ కబ్జాలను క్రమబద్ధీకరించడానికే పనికివచ్చాయి. దానితోపాటు ఆంధ్ర వలసపాలకుల దోపిడీకి వత్తాసు పలుకుతూ దానిలో భాగం పంచుకుంటూ, దాన్ని పెంచి పోషించుకుంటూ లాభం పొందారు, లోకల్ దోపిడీకారులు. పెద్ద దోపిడీ శక్తులకు ఊడిగం చేయకతప్పని పరిస్తితిని అరికట్టడానికి చోటా స్థానిక దోపిడీదార్లను వారిని ఆంధ్ర అధినాయకులనుంచి వేరుచేయాలి.
ఇక్కడి పెత్తందారీ వ్యవస్థతోనే మేం పోరాటం చేస్తున్నాం ఇంకా ఇంకొకరి పెత్తనం మమ్మల్ని నాశనం చేస్తుంది అని ప్రజలు మొత్తుకుంటుంటే, ఆ పెద్దలతోనే ఒప్పందాలు, ఒడంబడికలు చేసుకోవడం ఏ ప్రజలను ఉద్ధరించడానికి? ఏ ప్రజలను సమాధానపరచడానికి? అనే ప్రశ్నలకు జవాబులూ కావాలి.
ఏదైనా సమస్యకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేస్తుంటే ఆ సమస్యను తీర్చకపోగా దాన్ని పెంచడం సమస్యకు పరిష్కారం ఎప్పుడూ కాజాలదు. ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాల కలయిక అటువంటిదే. కనుక విడిపోవడమే సంస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం.
ఈ దోపిడీ అనేది అన్ని రంగాల్లో ఉంది. క్లుప్తంగా చెప్పుకోవాలనుకొంటే కొన్ని విషయాలు.
వ్యవసాయ రంగం
తెలంగాణా ప్రాంతంలోని వ్యవసాయ విధానాలు ఆంధ్రాప్రాంతంలోని విధానాలకు భిన్నమైనవి. ఆంధ్రప్రాంతంలో వ్యవసాయం చాలావరకు వెట్ల్యాండ్ అగ్రికల్చర్, అదే తెలంగాణా ప్రాంతంలో అది వర్షాధారమైనది. ఆంధ్రాప్రాంతంలో సాగునీటి కోసం నదులపైని ఆనకట్టల మీద ఆధారపడితే, కలయికకు ముందువరకు డాములు లెని తెలంగాణా ప్రాంతంవారు చెరువులు, బావులమీద ఆధారపడ్డారు.
ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల కలయికద్వారా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణా ప్రాంతంలో ప్రవహిస్తున్న నదులపైన ఆనకట్టల నిర్మాణం జరుగవలసి ఉండింది. సుస్థిర వయవసాయానికి, ప్రభుత్వ పెట్టుబడులతో సాగునీటివనరులను ఆంధ్రాప్రాంతానికి అందించినట్టే తెలంగాణా రైతులకు అందించాల్సింది. కాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలా చేయలేదు. పైగా అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఉన్న చెరువులు, బావులు సరైన నిర్వహణ లేక ఎండిపోయినాయి. అంటే స్వాతంత్ర్యం తరువాత ఎక్కువ అభివృద్ధి చెందవలసిన ప్రాంతం, అప్పటివరకు ఉన్న అభివృద్ధిని కూడా కోల్పోయింది. ఇదే దోపిడీ. ఇది ప్రభుత్వ నిర్వాకం!
ఈ కారణాల చేత సహజంగా సుభిక్షమైన ప్రాంతమైన తెలంగాణాలో ప్రభుత్వ వివక్ష వల్ల తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం రైతులను కొల్లగొడుతూ ఆత్మహత్యలకు నెట్టుతున్నది. కొందరు తెలంగాణ ప్రజలకు వ్యవసాయం రాదనే ప్రచారం చేస్తున్నారు. మరికొందరైతే నష్ట పరిహారం కొరకే రైతులు ఆత్మహత్యలౌ చేసుకొంటున్నారనీ క్రూరంగా అపహాస్యం చేసారు. ఆధ్రా దోపిడిని కప్పిపుచ్చేందుకు తెలంగాణా రైతులను దోషులను చేయడం అన్యాయము.
ప్రభుత్వం ఎంతసెపూ ఆంధ్రాప్రాంతంలోని వ్యవసాయ విధానాలు, సాగునీరుపైన దృష్టి పెట్టంది తప్ప తెలంగాణా ప్రాంతంలోని అభివృద్ధి తిరోగమనంలో ఉన్నది అనే ఆలోచన కూడా లేకుండా ప్రవర్తించింది.
అన్నం పెట్టే రైతు బికారిగా మారాడు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే చాలామంది చిన్నా చితకా రైతులు ఉన్న కొద్దిపాటి భూమిని అమ్ముకొని రైతుకూలీలుగా మారారు. భూస్వామ్యవ్యవస్థకు వ్యతిరేకంగా భూ పోరాటం చేసి సంపాదించుకొన్న కొద్దిపాటి భూమిని అమ్ముకొని బికారులైనారు. అంతేకాదు ఎంతో కొంత నీటివసతిఉన్న భూములను ఆంధ్రా వాళ్ళు హస్తగతం చేసుకొన్నారు. నీటివనరులున్న తెలంగాణ మారుమూలల్లో కొత్తగా గుంటూరుపల్లెలు వెలిసినాయి. హైదరాబాదు చుట్టుపక్కల పొరుగు జిల్లాలవరకు భూములన్నీ కబ్జా చేసారు. ఇదంతా చట్టవ్యతిరేకమైనది. 1956 పెద్ద మనుషుల ఒప్పందానికి ఇది ఉల్లంగణ. ఈ నేరాలను సరైనవని చెప్పేందుకు ఈ నియమాలను, వాటి అమలును చూసే ప్రాంతీయ కమిటీని రద్దు చేసింది ప్రభుత్వం. దోపిడీ తప్పన్న మాటనే చట్టాల్లో లేకుండా చేసారు. గిరిజన ప్రాంతాల్లోను భూబదలాయింపు నిషేధాలను ఉల్లంగిస్తూ ఆంధ్రవాల్లు గిరిజన్లను దోచుకొంటున్నారు. ఇదే సమైక్యాంధ్రా ఫలితం. ఇదే రైతులు చూసిన దోపిడీ. దీనిని అరికట్టడడము అంతం చేయడమే ప్రజలు కోరేది.
ఈ దోపిడీకి కారణం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే కాక మరొకటి కాదు. అందుకే ఈ ప్రాంతంలోని ప్రతి రైతుకు ప్రత్యేక రాష్ట్రం కావాలి. ప్రత్యేక రాష్ట్రంలో మాత్రమే వారి భూములు తిరిగి వాళ్ళకొచ్చేది, వారిపై సాగుతున్న దోపిడీ అంతమయ్యేది. ఆలాగే ఈ ప్రాంతానికి అనుగుణమైన ప్రత్యేకమైన వ్యవసాయ విధానాలను తిరిగి పునరుద్ధ్రించుకోగలుతారు. వివక్ష లేకుండా ఇక్కడి సాగునీటి సదుపాయాలను పెంపొందించుకోగలుగుతారు.
కుటీర పరిశ్రమలు– చిన్న వ్యాపారస్తులు
పారిశ్రామికీకరణ, గ్లోబలైజేషన్ వలన దేసంలోని అన్ని చిన్న చితకా వ్యాపారస్తులు బాగానే దెబ్బతిన్నా అది తెలంగాణాలో తీవ్రస్థాయిలో ఉన్నది. రాష్ట్రం మొత్తంలోని మార్కెటింగ్ వ్యవస్థపైన ఆంధ్రప్రాంతపు పెట్టుబడిదారులు ఆధిపత్యం సంపాదించినారు. దాని కారణంగా అధికంగా నష్టపోయింది- చేనేత కార్మికులు.
అంర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన పోచంపల్లి, గద్వాల్ చీరలకి ప్రోత్సాహం లేకపోవదమేమిటి? చేనేత కార్మికులు నష్టాల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏమిటి? ఆ నేతగాళ్ళు నష్టపోవడమేమిటి? దానికి కారణం కేవలం వివక్ష. మార్కెటింగ్ వ్యవస్థపైన పూర్తి ఆధిపత్యం కలిగిఉన్న ఆంధ్రాప్రాంతపు పెట్టుబడిదారులు తెలంగాణా ప్రాంతపు ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడము, ప్రభుత్వము అనేక వ్యాపరలకు పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన ప్రత్యేక సదుపాయలాను చేనేతరంగానికిచ్చి ప్రోత్సహించకపోవడమే.
చేనేతలు, బిద్రీ, నిర్మల్ మొదైన ఎంతో వైభవోపేతమైన కళారూపాలను నిర్లక్ష్యం చేసారు, దాంతో ఆ కళాకారులంతా నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఈ రంగంలో కూడా దాడి కేవలం మార్కెటింగ్ పరంగా మాత్రమే జరగలేదు. సంస్కృతిపరంగా కూడా దాడి జరిగింది. ఇక్కడి కళారూపాలన్నీ మోటైనవనీ, పాతకాలపువనీ రకరకాలుగా ఉదృతమైన ప్రచారం సాగుతున్నది. ఆ ప్రచారం ఎంత తీవ్రంగా ఉన్నదంటే ఆఖరికి తెలంగాణాప్రాంతం వారికే వారి ఉత్పత్తులు ‘ఘర్‌కీ ముర్గీ దాల్‌బరాబర్ ‘ అనే విధంగా తోచేలా ఉన్నది. ఈ రకంగానే అన్ని రంగాల్లోనూ ఆర్ధిక, మానసికమైన దాడులతో ఆధిపత్యం సంపాదించి, ఎన్నోరకాలుగా స్వయంసమృద్ధులైన తెలంగాణా ప్రాంతంవారిని దోపిడీకి గురిచేసి వారి అభివృద్ధిని అడ్డుకున్నారు.
ఇక ఇప్పుడేమో అవును, నిజమే తెలంగాణాలో అభ్వృద్ధి జరగాల్సినంతగా జరగలేదు అంటున్నారు. కాని ఇక్కడ జరిగింది అభివృద్ధి జరగకపోవడం కాదు దానికి వ్యతిరేకంగా దోపిదీ జరిగింది. దానికి పరిష్కారం అభివృద్ధి చేయడం కాదు, దోపిడీని నివారించడం. అంటే ఆంధ్రాప్రాంత ఆధిపత్యాన్ని పారద్రోలడం.
ఉద్యోగ, విద్యారంగాలు
తెలంగాణా ఉద్యమం అనంగానే గుర్తొచ్చేది 610 జీ. ఓ. అమలు కాలేదనీ, ముల్కీ రూల్స్ ఉల్లంఘణ గురించీ చాలామంది చాలాచాలా మాట్లాడటం. అయితే ఈ రంగంలో కూడా చర్చకురాని విషయాలు కొన్ని ఉన్నాయి. పెద్దమనుషుల ఒప్పందంలో చేసుకున్న ఒక్క ఒప్పందమూ అమలుకు నోచుకోలేదన్నది జగమెరిగిన సత్యం. దాంట్లో భాగమే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ముల్కీరూల్స్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యోగాల నియామకం. ఆ తరువాత గిర్‌గ్లానీ కమిషం, దాని తరువాత 610 జీ. ఓ. అదీ అమలుకు నోచుకోలేదు. ఇంత వరకు ఎన్ని లక్షల ఉద్యోగాలను ప్రాంతేతరులు చట్టాలను ఉల్లంఘిస్తూ సంపాదించుకొన్నారో లెక్క లెదు. అన్ని కాకి లెక్కలే. ఆఖరికి ప్రభుత్వం నియమైంచిన గిర్గ్లాని కమీషనుకు కూడ ప్రభుత్వ అధికారులె సమచారమివ్వడానికి షకరించలేదు. తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఈ దొంగదారిన ఉద్యొగాలను కొల్లగకొల్లగొట్టిన వారి పేర్లను ప్రకటించలేదు. సంవత్సరాలుగా వేల లక్షల మంది ప్రాంతీయులకు చెందాల్సిన ఉద్యొగాలను పొరుగు ప్రాంతాలవారు బాజాప్తా అనుభవిస్తుంటే దానిని బయటపెట్టడనికి, అరికట్టడానికి ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగ సంఘాలకు ఆఖరికి తెలంగాణ నాయకులకు మాట్లడే ప్రయత్నం చేయలేదు. వ్యవస్థలో వీరెవరు నోరుతెరవడము, న్యాయం చేయడము సాధ్యం కాదనితేటతెల్లము.
ముల్కీరూల్స్ ప్రకారం ఉద్యోగ నియామకాలు స్థానికులకు చెందాలి. కాని తిరకాసులు పెట్టి జోన్లని, స్పెషల్ జోనల్ని స్థానికుల ఉద్Yఒగవకాశాలను దోచుకొంటున్నరు. స్థానికుల పొట్టనుకొట్టి వారి ఉద్యోగాలను తినేయడంతోపాటు పాలనలో తెలంగాణవారికి ఉన్న అవకాశాలను మింగేస్తున్నారు. సర్కారు పనులు జిల్లానుంచి సెక్రటేరియటువరకు తెలంగాణవాళ్ళ చేతుల్లోంచి జారిపోయింది.
ముల్కీరూల్స్‌కు వ్యతిరేకంగా జరిగిన నియామకాలను సవరించేవిధంగా 610 జీ. ఓ. లేదని స్పష్టం. అలాగే ప్రభుత్వానికి కాని రాజకీయ నాయకులకుగాని ఈ అక్రమ నియామకాల్ని సవరించే ఉద్దేశ్యం ఏమాత్రం లేదనేది స్పష్టం. ఇదే దోపిడీ, ఇంకా దోపిడీని చట్టబద్ధం చేయడమంటే. అయితే మరి దీనికి పరిష్కారం? ఇంకా ఇంతకాలం న్యాయంగా తెలంగాణా వాసులకు రావాల్సిన ఉద్యోగాల్ని ఇంకెవరో అనుభవించినందుకు నష్టపరిహారం ఏమిటి?
గైర్‌ముల్కీ నియామకాల్నిరద్దుచేసి, ఆ ఆ స్థానాల్లో కొత్తగా తెలంగాణా ప్రజలను మాత్రమే నియమించాలి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరిగేపనేనా?
ఉద్యోగావకాశాల్లోనే కాదు, విద్యావకాశాల్లో కూడా తెలంగాణా వాసులు దోపిడీకి గురైనారు.
తెలంగాణాప్రాంతంలో అక్ష్రాస్యత రేటు పెరిగింది అంటే దానికి కారణం నిజాం పాలననుండి హైదరాబాదు విముక్తమవ్వడమే కాని, ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం ఎంతమాత్రం కాదు. హైదరాబాదు ప్రత్యేకరాష్ట్రంగా ఉన్నా కూడా అది జరిగిఉండేది. అయితే అధిక డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఆంధ్రుల ఆధిపత్యం ఉన్నది. దీనిలో కూడా ఎలాంటి అడ్డూ అదుపూ లేదు.
ప్రైవేటు రంగాల్లో ఈ ఆధిపత్యం అనేదాన్ని ఆపడానికి సాధారణంగా ఎలాంటి చట్టాలు ఉండవు. అయినా రాష్ట్రాలు వేరుగా ఉన్నట్లయితే సహజంగా ప్రజలూ, ప్రభుత్వమూ కలిసి వాటిని నియంత్రిస్తారు. అందుకనే ఏ రాష్ట్రంలో అయినా ఇతర రాష్ట్రాలనుండి వలసలు ఉంటాయి కాని ఆధిపత్యం మాత్రం స్థానికులదే అవుతుంది. తెలంగాణా లోకి ఇంత పెద్దేత్తున వలసలు జరిగినాయి పైగా వారి ఆధిపత్యం ఇక్కడ కొనసాగుతున్నది అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు. దీనికి పరిష్కారం విభజనే తప్ప మరేదీ కాదు.
ఇలా ఇన్ని రంగాల్లో ఆంధ్రావాసుల ఆధిపత్యం, దోపిదీ కారణంగా తెలంగాణా ప్రాంతంలో అభివృద్ధి తిరోగమనంలో ఉన్నది. అయితే ఈ దోపిడీ ఆర్ధికపరంగానే కాదు, సామాజికపరంగా కూడా జరిగింది.
సామాజిక దోపిడీ
ఈ ఆధునిక యుగంలో సమాజాన్ని అత్యధికంగా ప్రభావితం చేసేవి ప్రసార సాధనాలు. పత్రికలు, సాహిత్యం, పాఠ్యపుస్తకాలు, టీవీలు, రేడియోలు, సినిమాలు మొదలైనవి. ఈ ప్రసారసాధనాలన్నిట్లోను ఆంధ్రవాసులదే ఆధిపత్యం. అన్ని ప్రసారసాధనాల్లో ఉపయోగించేది ఆంధ్ర ప్రాంతపు భాష. విషయం ఆంధ్రావాసుల సంస్కృతిని, ఆచారవ్యవహారాల్ని, జీవన విధానాన్ని, తిండి, కట్టూ, బొట్టూ, భాషా, యాసల్ని ప్రతిబింబిస్తుంది. ఎక్కడైనా పొరపాటున తెలంగాణా భాష, యాస ఇతర విషయాలెమైనా కనిపించినా, వినిపించినా, అది ఆ ప్రాంతాన్ని అపహాస్యం చేయడానికే తప్ప మరొకటి కాదు.
ఆఖరికి పాఠ్యపుస్తకాల్లో కూడా ఆంధ్రభాషే. ఆంధ్ర సంస్కృతి, ఆంధ్రుల చరిత్ర చదువుకోవలసిందే. ఒకప్పుడు రాజులకాలంలో ప్రజల చరిత్ర, భాష, యాస, సంస్కృతి వెరసి సాంఘిక చరిత్ర, జానపదుల పాటలు, కథలు మొదలయిన మౌఖిక కళారూపాల ద్వారా మత్రమే కొద్దోగొప్పో తరువాతి తరాల వారికి తెలిసేది. లిఖిత రూపంలో సాంఘిక చరిత్ర ప్రజల సంస్కృతి మెరుగైన సమాజంకోసం వారి పోరాటాలు వటి వారసత్వం తెలిసే అవకాశం ఉండదు. తెలంగాణాలో మాత్రం రాజులు పోయినా ఆ పరిస్థితిలో మార్పు రాలేదు. అంతేకాదు సంస్కరణ పేరుతో తెలంగాణా భాషను, సంస్కృతిని, ఆచారవ్యవహారాలను పూర్తిగా రూపుమాపే దాడి జరుగుతున్నది.
ఇంతకుముందు లేని అత్యంత ప్రతిభావంతమైన ప్రసారసాధనాల ద్వారా తెలంగాణ వ్యతిరేక సాస్కృతిక దాడి విధ్వంసం పకడ్బందీగా జరుగుతున్నది. తప్పుడు ప్రచారంతో, వక్రీక్రణలతో ప్రజలను బ్రెయిన్ వాష్ చేయడం జరుగుతున్నది. 53 సంవత్సరాల నిర్విరామ దాడి తర్వాతకూడా తెలంగాణాప్రజలు తమ ఉనికిని, తమ ప్రత్యేకతను కోల్పోలేదంటే దానికి కారణం తెలంగాణా ఒక ప్రత్యేకమైన, భిన్నమైన జాతి కావడమే. దానికి ఇదొక నిదర్శనం. తరతరాల నుండి తమదైన సంస్కృతినీ, జీవనశైలినీ, పోరాటాల చరిత్రను, విష్వాసాలను, అచార వ్యవహారాలనూ కలిగిఉన్నది. తెలుగుభాషే మాట్లాడినా అది ఆంధ్రకంటె ఒక ప్రత్యేకమైన, భిన్నమైన జాతి. అదే తెలంగాణ గుర్తింపు. ఆంధ్రా తెలంగాణాల మధ్య 1956 నుంచి ఇప్పటివరకు జరిగింది కేవలం ఆంధ్ర వ్యాపారా విస్తరణ, రాజకీయ పెత్తనం, ఒక దోపిడీ సంబంధాల విస్తరణ. ఈ రెండు ప్రాంతాలు మాన్సింకంగ పరస్పర గౌరవంతో ఒక తల్లి బిడ్డలుగా వాత్సల్యం ప్రేమతో సమైక్యం కలేదు. మార్కెటు సమబందాలకేగాని పెళ్ళి సమబంధాల్లో ఇచ్చిపుచ్చుకోవడము, పనడగల్లో అచార వ్యవహారాల్లో కలిసిపోవడము ఎదుటివారిపట్ల ఆదరణ ప్రేమ ఇంతవరకు లేవు. తెలంగాణలో హిందూ ముస్లీముల మధ్య ఉన్న సాన్నిహిత్యము ఆంధ్రా తెలంగాణ వారి మధ్య కనిపించదు. ఈ మానసిక ఎల్లలను సర్హద్దులను మార్కెటు సమబందాలు శాసించటము వల్లనే ఒకే భాష మాట్లడేవారైనా కలయిక కృత్రిమంగా ఉండిపోయింది. ఆంధ్రా దోపిడీ తత్వమే ఈ కలయిక కొనసాగడానికి ప్రత్బంధకంగా ఉంది.
ఒకే భాష మాట్లాడే ప్రజలమధ్య ఆరొగ్యకరమైన్ సాంస్కృతిక సత్సంబంధాలు అభివృద్దిచెందేందుకు దోపిడిసమబమదాలను అరికట్టాల్సినందే.
హైదరాబాద్
తెలంగాణాలో జరిగిన వివిధరకాల దోపిడీకి హైదరాబాద్ మినహాయింపేమీ కాదు. ఇక్కడ కూదా అదే రకమైన దోపిడీ, దాడి కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడి పరిస్థితి మిగతాజిల్లాల పరిస్థితికంటె కొంత భిన్నంగా ఉంటుంది. కాబట్టి దీనిగురించి ప్రత్యేకంగా ప్రస్తావించవలసి వస్తుంది.
హైదరాబాద్ నగరం 1956లోనూ, మరి ఇప్పుడూ దేశంలో ఐదవస్థానంలోనే ఉన్నది. రాజులు, పాలకులు తమ పరిపాలనా సౌలభ్యం దృష్ట్యాకాని మరే ఇతర కారణాల వలనకానీ దేశాన్ని, రాష్ట్రాన్ని, నగరాలను అభివృద్ధి చేస్తుంటారు. అందులో భాగంగానే బ్రిటిషువారు భారత దేశంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడితే, నిజాం నవాబులు హైదరాబాద్ ప్రాంతంలో అభివృద్ధి పధకాలను చేపట్టినారు. ఎవరు, ఎవరికోసం ఈ అభివృద్ధి చేసినా అది ప్రజల సొమ్ముతో, వాళ్ళ శ్రమతో మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఆ అభివృద్ధి, ఆ నిర్మాణాలు, కట్టదాలు పూర్తిగా అప్రాంత ప్రజలకే సొంతం. అలా కాకుండా అదంతా ఆ పాలకులకో, ఆ పాలకుల సంబంధీకులకో మాత్రమే సొంతము అనడం మూర్ఖత్వానికి పరాకాష్ట.
ఆ రకంగా తెలంగాణా వాసులకు మాత్రమే సొంతమైన హైదరాబాద్ నగరాన్ని ఆంధ్రవాసులతో పంచుకోవాలనే ఆలోచన విడ్డూరమైనది. నచ్చింది కనుక అది నాదే అనుకోవడము న్యాయం కాదు. పోనీ అని ఇంట్లోకి రానిస్తే ఇల్లంతా నాదే అనడం అన్యాయమని తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మత గ్రంథాల్లోనైనా, రామాయణంలో కాని, చట్టాల్లో కాని దురాశ కారణంగా హక్కులు ఏర్పడవని ఉంటుంది.
అన్ని ఒప్పందాలను తుంగలో తొక్కి యదేచ్చగా భూఆక్రమణలు, ఉద్యోగాలలోనూ, ఇతర విషయాల్లో ఆంధ్రావాసుల దుశ్చర్యలు, అన్యాయాలు మొత్తం తెలంగాణాలో ఒకవిధంగా జరిగితే, హైదరాబాదులో ఈ దోపిడీలో ఎన్నో రేట్లు ఎక్కువగా అయినది. స్వాతంత్ర్యం వచ్చి ఇంతకాలమైనా హైదరాబాద్ ప్రజల జీవన ప్రమాణాల్లో పెద్దగా మార్పురాలేదంటేనే అర్ధమవుతుంది– ఇక్కడ జరిగిన అభివృద్ధి వలన ఈ నగరవాసులు ఏపాటి లాభపడ్డారో. న్యాయంగా హైదరాబాద్‌లోని అభివృద్ధి, పెట్టుబడుల వలన లాభం పొందవలసింది తెలంగాణా ప్రజలు. కాని సొమ్మొకరిది సోకొరిది అన్నట్టుగా హైదరాబాద్ నిర్మాణంలో ఎటువంటి పాత్ర లేని ఆంధ్రావాసులు ఈ నగరాన్నే కబ్జా చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో విలీనమైనప్పటినుంచి రెంటు కంట్రోల్ చట్టాన్ని దురుపయోగించి హైదరబాదులోని వేలాది ఇళ్ళను లిటిగేషన్లోకి లాగి అణా చెల్లించకుండానే స్థానికులనుంచి లాక్కొన్నారు, చుట్టుపక్కల భుములను కబ్జా చేసుకొన్నారు.
ఆఖరికి మేము ముల్కీలమంటూ తెలంగాణావాసులు చెప్పుకొంటూ తిరిగకపోయినా మేము సెట్లర్లము అంటూ ప్రాంతేతరులు బాహాటంగా తిరుగుతున్నారు. వారికి వలసవాదుల ప్రచారము, ప్రోత్సాహము, ప్రోద్బలమూ దండిగా ఉన్నాయి. గుమ్మడికాయ దొంగలంటె భుజాలు తడుముకొన్నట్లుగా సెట్లర్ల ఫోరంలు వెల్సినాయి కూడా. హైదరాబాదు కాలనీలలాగ మారిన వైనం ఎవరు గుర్తించవొద్దని సెట్లర్లు కూడా తెలంగాణకు అనుకూలం అనే కుట్ర నడుస్తున్నది.
హైదరాబాదీలు అంటే ముస్లింలనీ, హిందువులనీ ఇంకెవరో అనీ భేదాలేం ఉండవు. హైదరాబాదీలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలు. కొంతమంది స్వార్ధపరులు వారిని విభజించి లాభంపొందడానికి ప్రయత్నిస్తున్నారు కాని, హైదరాబాద్‌లో ఐకమత్యానికెలాంటి లోటు లేదు..
హైదరాబద్ నగరంలో ఇతర రాష్ట్రాలనుండి చాలామంది వ్యాపారులు పెట్టుబడులు పెట్టినారు. 1948లో నిజాము పాలన అంతమైనపుడుగాని, 1956లో ఆంధ్రప్రదేశ్ గా మారినపుడుగాని ఇక్కడి వ్యాపారస్తులకు పారిశ్రామికవేత్తలకు రాని ఇబ్బంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైతే ఆంధ్ర పారొశ్రామికవేత్తలకెందుకు? వ్యాపారము కేవలము లాభం కొరకే గాక రాజకీయ ఆధిపత్యంకోసం చూసినపుడె వ్యాపారస్తులకు రాజకీయ పరిణామాలతో ఇబ్బంది. ఆంధ్ర పెట్టుబడికున్న సమస్య అది. దానికి చరమగీతం పాడడము తెలంగాణ రాష్ట్రానికి తప్పనిసరి.
ఎవరు పెట్టుబడులు పెట్టినా దానికి కారణం ఆ ప్రదేశము, ప్రజలు అక్కడ ఉన్న సౌకర్యాలు, దానికి అనుకూలంగా ఉండడమే. అంతేకాకుండా తగిన లాభాలు వస్తాయన్న నమ్మకం ఉండడం ఇంకో కారణం. ఆ పెట్టుబడులవలన స్థానికులు కొంత లాభపడమనేది సహజం. కానీ లాభాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఎవరూ పెట్టుబడులు పెట్టరు. ప్రజలు కూడా కొంత లాభపడుతున్నారనే కారణంగా, నగరం పెట్టుబడిదారులకే అమ్మేయలనడము అవివేకం. కుట్ర కూడా.
హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల మేలుకలయిక. ఈ మేలు కలయికను సాధ్యంచేసిన ఘనత ఈ నగరవాసులదే. ఇటువంటి హైదరాబాద్‌ను కబ్జా చేసుకుందామని, ఆధిపత్యం చెలాయిద్దామని ఆంధ్రావాసులు ప్రయత్నం చేయడం దోపిడీకి పరాకాష్ట. ఆ దోపిడీకి ప్రాంతీయులే వత్తాసు పలకడం అవకాశవాదానికి పరాకాష్ట. ఈ మోసాన్ని నగరవాసులు గుర్తెంచకపోయినా, గుర్తించి ఎదిరించకపోయినా ఇంతకంటె మూర్ఖత్వమో అమాయకత్వమో ఇంకొకటి ఉండదు.
తెలంగాణావాసులు తాము నిర్మించుకున్న నగరంవలన తాము లాభపడదామనుకోవడం సహజం. హక్కు కూడా. వారికి న్యాయంగా దక్కవలసిన అవకాశలను, జీవనోపాధులను, వ్యాపార ఉద్యోగ అవకాశాలను కొల్లగొడుతున్న ప్రాంతేతర ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను శత్రువులగా చూడడము ఆత్మరక్షణే కాక మరొకటి కాదు.
అంటే స్థూలంగా చెప్పాలంటే హైదరాబాదీలకూ తెలంగాణ కావాలి, అదీ సెటిలర్లు లేని తెలంగాణ కావాలి అని ప్రజలు అనుకొంటున్నారు. కొందరు నాయకులు మాత్రం ఊగిసలాడుతున్నారు. ఒకరోజు ఆంధ్రా వాలే భాగో అని మరొక రోజు సెట్లర్లతో సహజీవన యాత్ర అంటూ నాటకాలాడుతున్నారు. నేటి పార్టీల చర్చల్లో సెట్లర్లు తెలంగాణ విషయంలో స్పష్టత లోపించడమో అవకాశవాదమో ఉందని అనుకొనేవారు నిరుత్సాహంగా ఉన్నారు.
1969లో తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున సాగినపుడు ఆంధ్ర గోబాక్, ఇడ్లీ సాంబార్ గోబాక్ నినాదాలుండే. మరి అప్పుడూ ఇప్పుడూ దోపిడీ ఒక్కటే సమస్యకు కారణమైనప్పుడు మరి నినాదాలెందుకు మారిపోయినాయి? అని అడిగేవారూ ఉన్నారు. ఎందుకు ఎవరి ప్రయోజనాలకొరకు “ఆంధ్ర గోబాక్” నినాదం తుప్పు పట్టుతున్నది. సమస్య వేరు కానప్పుడు ఆ సమస్యకు పరిష్కారమూ వేరు కాజాలదు. ఆకలి వేసినవాని ఆకలిని తీర్చగలిగేది ఆహారమేకాని, బంగారు నాణాలు ఇనుప నాణాలూ కావు.
భూకబ్జాలు
తెలంగాణాలోని భూములు అన్యాక్రాంతం కాకుండా తెలంగాణావాసులకే సొంతమై ఉండేందుకు గాను పెద్దమనుషుల ఒప్పందంలో తెలంగాణా రీజనల్ కమిటీని ఏర్పాటు చేసినారు. పెద్దమనుషుల ఒప్పందంలోని అన్ని ఒప్పందాల్లాగే ఈ రీజనల్ కమిటీ నామమాత్రపు కమిటీగా కొంతకాలం కొనసాగి ఆ తరువాత రద్దు చేయబడింది.
తెలంగాణా ప్రజలు భయపడినంతా అయ్యింది. భూకబ్జాలు యదేచ్చగా కొనసాగినాయి. ఇక వలసలు మిగతా ఇతర రాష్ట్రాలనుండి హైదరాబాద్ రాష్ట్రంలోకి జరిగిన వలసల వలె ఏదో కొన్ని కుటుంబాలుగా కాక పల్లెలుగా వలసలు మొదలయినాయి. అంటే తెలంగాణాలో గుంటూరు పల్లె వంటి ఆంధ్రా పల్లెలు వలసినాయి. ఇక హైదరాబాద్‌లో ఏకంగా కాలనీలే వెలసినాయి. వివేకానందనగర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. ఇవన్నీ అక్రమ కబ్జాలే.
ఇప్పుడు తెలంగాణా నాయకులు తెలంగాణాలోని సమస్యల కోసం పోరాడి తెలంగాణావాసుల సపోర్ట్‌ను సంపాదించుకోవడం మానేసి, సెటిలర్ల వెనక పడ్డారు. సెటిలర్లు ఎక్కడికీ వెళ్ళవలసిన అవసరం లేదని, వాళ్ళతోని మాకెలాంటి ఇబ్బందీ లేదనీ వారికి విన్నవించుకుంటున్నారు.
తెలంగాణావాసులకే చెందవలసిన తెలంగాణా భూములు కబ్జాలకు గురైతే చూసుకుంటూ ఊరుకోవడమే ఈ నాయకులు చేసిన తప్పయితే ఇప్పుడు ఆ కబ్జాలను సమర్ధించుకుంటూ ఇంకో పెద్ద తప్పు చేస్తున్నారు. అది సరిపోనట్టు దానికి తెలంగాణా ప్రజలనే మద్దతు ఇవ్వమంటున్నారు. ఇంకా ఇటువంటి నినాదాలతో తెలంగాణా ప్రజల సంస్యలను తీర్చే తెలంగాణా సాధిస్తాం అంటుంటే ప్రజలు ఈ డబుల్ గేం ఏమిటో అర్ధంకాక వెర్రిచూపులు చూస్తున్నారు. ఒకరో ఇద్దరో తేరుకుని ఇదేమిటని ప్రశ్నిస్తే, మన నాయకులని మనమే విమర్శించుకుంటే ప్రత్యర్ధులకి చులకనవుతామని చిలకపలుకులు పలుకుతున్నారు. మరి ఆ ప్రత్యర్ధులెవరో అది ఎవ్వరికీ అంతుపట్టని పదార్థం.
ఇతర జిల్లాల్లో హైదరాబాదులోనే కాదు. ఏజెన్సీ ఏరియాల్లో కూడా భూకబ్జాలు విరివిగా జరిగాయి, దానికి వ్యతిరేకంగా ఆదివాసీలు పోరాటం చేస్తునే ఉన్నారు. ఒకవేళ ఎవరయినా ఈ భూకబ్జాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ వెనుక రావడానికి వారూ సిద్ధపడతారు. ఆ దిశగా నాయకులెవరొ అడుగులేస్తున్నట్టు కనిపించదు. పైగా ఆ కబ్జాదారుల్లో తెలంగాణా నాయకులు కూడా భాగస్తులే కాబట్టి వాటిని క్రమబద్ధీకరించడానికి ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణా నాయకులు
ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలు దోపిడీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో గురయినారు. ఆ కారణంగానే తెలంగాణాలోని అన్ని వర్గాల ప్రజలూ తెలంగాణా కోరుకుంటున్నారు. అదీ వారి సమస్యలను తీర్చే తెలంగాణాను కోరుకుంటున్నారు.
ఇలా తెలంగాణాలోని అన్ని వర్గాల ప్రజలూ వారి వారి సమస్యల పరిస్కారం దృష్ట్యా ప్రత్యేక తెలంగాణ కోరుకుంటున్నట్లే మరో వర్గమైన తెలంగాణా నాయకులు కూదా తెలంగాణా కోరుకుంటున్నారు. వారికుండే కారణాలు వారికీ ఉన్నాయి. తెలంగాణాలో జరిగిన దోపిడీలో ఈ తెలంగాణా నాయకులలో చాలామంది భాగస్థులే కాబట్టి దోపిడీకి గురయిన వాళ్ళలో వీరు ఒకరు కాలేరు. కాకపోతే ఆంధ్రాలో వారికి చోటెలాగూ దొరకదు, ఇక తెలంగాణాలోని సమస్యల గురించో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం గురించో మాట్లాడకపోతే ఈ ప్రాంతంలో వారి ఉనికే ప్రశ్నార్ధకమయ్యే ప్రమాదముంది. అందుకోసం వాళ్ళకి కూడా తెలంగాణా కావాలి. అట్లాగే ఇప్పటి వరకూ వారు పొందిన, పొందుతున్న లాభాలను వదులుకోవడం కూడా ఇష్టం లేదు. అందుకనే ప్రజలందరి దారిలో కాక దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఏ సమస్యల పరిష్కారం, ఎవరికీ ఎలాంటి న్యాయమూ జరగవలసిన అవసరం లేదు. మాకు భౌగోళిక తెలంగాణ చాలు అని నాయకులు అంటున్నారు. ఇంకా దాంట్లో ప్రజల్ని భాగస్థుల్ని కమ్మంటున్నారు. జై సెట్లర్, జై దోపిడీ కార్లు అంటూ, ప్రజలను వారితో కలిసి నడవమంటున్నారు. ఇదెక్కడి విడ్డూరం! అయినా సరే ఏదో ఒకరకంగా తెలంగాణా వస్తే తరువాత నిమ్మలంగా సమస్యలను పరిష్కరించుకుందామనే ఆశతో కొంతమది ప్రజలు కూడా నాయకుల అడుగులలో అడుగులేస్తున్నారు. కానీ ఇంకా చాలామంది జనం ఇందులో భాగం పంచుకోవట్లేదు. అందుకే ప్రజలదొక దారి, నాయకులదొక దారి అవుతున్నది. అలాకాక ఈ నాయకులు ప్రజల సమస్యల పరిష్కార దిశగా తెలంగాణా ఉద్యమాన్ని నడిపిస్తే అన్ని వర్గాల ప్రజలూ వారితో కలసి వస్తారు. నిజమైన ప్రళయాన్ని గుర్తుచేస్తారు. అంతేకాదు ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలూ కలసివస్తే అందరికీ ఆమోదమైన ఒక కార్యచరణను రూపొందించుకుని, ప్రణాళికా బద్ధమైన ఉద్యమంతో మళ్ళొకసారి మోసపోకుండా తప్పకుండా మనదైన తెలంగాణాను సాధించుకోవడం కష్టసాధ్యమేమీ కాదు. అలాకాకుండా ప్రజల దారిలో కాక నాయకులు ఇట్లాగే భౌగోళిక తెలంగాణ అంటూ మొండివైఖరిని అవలంబిస్తే వారి దారిలోకి ప్రజలు రారు. ప్రజల దారిలోకి నాయకులే రావలసి ఉంటుంది. అప్పుడే ఆ ఉద్యమం సఫలీకృతమవుతుంది. లేదంటే నాయకులు ఏకాకులు మాత్రమే అవుతారు.
తెలంగాణా పోరాటం ఎవరికి వ్యతిరేకం
ఏ పోరాటమైనా దానికొక ప్రత్యర్ధి ఉండడం తథ్యం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా తెలంగాణా పోరాటం పెత్తందారీ వ్యవస్థకు, ఆధిపత్య ధోరణికి, దోపిడీకి వ్యతిరేకం. అంటే వీటికి కారణమైన వారినే ప్రత్యర్ధులుగా చెప్పుకోవచ్చు. తెలంగాణా నాయకులనే వారు కొందరు ఈ దోపిడీలో ప్రత్యక్షంగా భాగస్థులైతే, కొందరు పరోక్షంగా భాగస్థులు, మరికొందరు ఒట్టి ప్రేక్షక పాత్రను పోషించే వారు, ఇక ఏ కొందరో నిజంగా సమస్యను గురించి నిజాయితీగా మాట్లాడేవారు. వారుకూడా చాలావరకు సామాన్యప్రజల్లా అణచివేయబడతారు లేదా ఏమీ చేయలేక నిస్సహాయతతో చతికిలబడతారు. ఇంకొందరు ఇట్లాంటి వారితో కలవడం ఇష్టం లేక దూరంగా ఉంటుంటారు. ఇక్కడ ఒక్కవిషయం చెప్పుకోవాలి. చెడ్డనాయకుల వలన ప్రజలకెలాగు నష్టం కలుగుతుంది. అయితే మంచి చేయగల సత్తా ఉండి చేయడానికి కావలసిన ధైర్యం ఉండి, చేయాలన్న తపన కూడా ఉన్న నాయకులు ప్రజల్లోకి రాకపోవడం వలన ఆ ప్రజలు ఇంకా ఎక్కువ నష్టపోతారు.
అందువలన ఉద్యమం ఎవరికి వ్యతిరేకం అనే విషయం సాధారణంగా నాయకుల నోటినుండి వెలువడడం కష్టం. కానీ సమస్యను సరిగ్గా అర్ధం చేసుకుంటే, అప్పుడు ప్రజలు ఎవరికి వ్యతిరేకం అనేది, వారేం ఆశిస్తున్నారనేది సులభంగానే అర్ధమవుతుంది.
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుతో సమస్యలు తీరిపోతాయా?
తెలంగాణా నాయకులు చెప్పినట్లుగా భౌగోళిక తెలంగాణా మాత్రమే ఏర్పడితే ఏ సమస్యలు తీరవు. అంటే ప్రజలకు కావల్సిన తెలంగాణా కాదు, నాయకులకు కావల్సిన తెలంగాణా సిద్ధిస్తుంది. ఆ తర్వాతైనా నాయకులు వివిధ వర్గాల ప్రజల సమస్యలను, సమస్యమూలాలను గమనించి, ఆ సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేస్తే ఏమన్నా ప్రయోజనముంటుంది. కానీ అది జరిగేపనేనా? ఏమో! ఒకవేళ అది జరుగుతుంది అనుకున్నా సహజంగానే నాయకుల అడుగులెప్పుడూ తడబడుతుంటాయి. ఎప్పటికప్పుడు అంటే విషయం చేయిదాటిపోకుండానే ఎప్పటికప్పుడు కళ్ళాలు వేసి సరైన మార్గంలో నడిపించే బాధ్యతను ప్రజలు, మేధావులు, ప్రసారసాధనాలు తీసుకోవాలి. కాని అది అయ్యేపనేనా? ఏమో? అయితే ప్రజలెప్పుడూ అప్రమత్తులై ఉండడం అత్యంత అవసరం.
ప్రజల భాగస్వామ్యం లేదా బాధితుల భాగస్వామ్యం లేకుండానే ఏదైనా సాధించొచ్చు లేదా సమస్యను పరిష్కరించొచ్చని ఎవరైనా అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదమైన విషయం వేరొకటుండదు. అయితే ప్రజల సమస్యలను వాటి పరిష్కారాలను గురించిన ప్రస్తావన లేకుండానే వారి భాగస్వామ్యాన్ని ఆశించడమూ వెర్రితనమే అవుతుంది.
అందుకని నాయకులు ప్రజల భగస్వామ్యం లేకపోవడానికి వారి బలహీనతలైన తాగుడు వంటి వాటిని కారణాలుగా చూపడం వల్ల ఎవరికీ ఒరిగేదేం ఉండదు. పైగా ఈ బలహీనతలకి కారణం మళ్ళా వారి సమస్యలూ, ప్రభుత్య లోపభూఇష్ట విధానాలే అనే విషయమూ మర్చిపోవద్దు. అంతేకాదు ఈ బలహీనులే ఒకప్పుడు భూస్వామ్య వ్యవస్థను ప్రపంచమంతా అబ్బురపడే విధంగా ఎదురొడ్డి పోరాడిన వీరులని కూడా మరవొద్దు. వీరంతా ఇప్పుడు చావచచ్చి పడివున్నారనే అపోహలు కూడా కూడవు. నాయకుల ద్వంద్వ వైఖరుల కారణంగా ప్రస్తుతం ప్రజల్లో అయోమయం నెలకొని వున్న మాట నిజమే కాని ఈ అంధకారం వీడకా మానదు, కొత్త ఆశలతో సరికొత్త వేకువ రాకా మానదు.
